మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు పోటెత్తారు. గురువారం మహాశివరాత్రి రోజున నాగుపాము కనిపిస్తే మంచిదని చెప్తుంటారు. ఇక శ్వేతనాగు కనిపిస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని చెప్తుంటారు.
మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేతనాగు మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో కోర్టు సమీపంలోని ఓ ఇంటి ముందు కనిపించింది. శ్వేతనాగును చూసిన కాలనీ వాసులు మంత్రముగ్దులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు, గుడ్లు సమర్పించారు. పడగవిప్పి ఆ పాము భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది.
ఆ సమయంలో శ్వేత నాగు.. పాలు తాగడంతో పాటు భక్తులకు ఎలాంటి హాని చేయకపోవడం విశేషం. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు చేరుకోవడంతో నాగుపాము భయపడింది. అక్కడున్న వ్యక్తులు స్నేక్ క్యాచర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.