హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అధికార టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు తాబేదారుగా, తొత్తుగా వ్యవహరిస్తున్నాడని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో శ్రవణ్ మాట్లాడారు.
ఆంధ్రా కేడర్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారికి తెలంగాణ రాష్ట్రంలో ఏం పని ఉందంటూ ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి అవగానే రాహిత్యంతో, బాధ్యతా రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఐఏఎస్ లు , ఐపీఎస్ అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారి పోయారని ఆరోపించారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన సదరు సీపీ ఫక్తు అధికార నాయకుడిగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థ తలొంచుకునేలా చేస్తున్నాడని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం పార్టీల అధినేతలు చెప్పినట్లు నడుచుకుంటూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో గణనీయమైన చరిత్ర ఉన్నది. అది ప్రజల కోసమే పని చేస్తోంది. తమ పార్టీ తీవ్రవాద సంస్థ కాదని సీపీ గుర్తుంచు కోవాలి.
కాంగ్రెస్ పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. ఈ బలగం కోట్లాది మందితో కూడుకుని ఉన్నది. వీలు టెర్రరిస్టులు కారు. సభ్య సమాజంలో బాధ్యత కలిగిన పౌరులు. హైదరాబాద్ నగర వీధుల్లో మా పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఆయుధాలు ధరించి తిరగడం లేదన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆర్ ఎస్ ఎస్ మార్చ్ కు, ఎంఐఎం పబ్లిక్ మీటింగ్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారని శ్రవణ్ నిలదీశారు.
దీనికి సీపీ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీరికి అనుమతి ఇచ్చిన సీపీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతి రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ జాతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించ లేదు. గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేపడతామని చెప్పింది.
అయినా యేవో కుంతీ సాకులు చెబుతూ సీపీ అనుమతి నిరాకరించడం ఎంత వరకు సబబు. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సీపీ అరెస్ట్ చేశారు. దీనిని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. శాంతియుత ర్యాలీకి సీపీ పర్మిషన్ ఇవ్వక పోవడంతో గాంధీ భవన్ లోనే సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగిందన్నారు శ్రవణ్.
కాంగ్రెస్ పార్టీ వేలాదిగా ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించింది. అంతే కాదు వందలాది సమావేశాలు కూడా సక్సెస్ చేసిన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు. అంతే కాదు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ , మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేలాది మందితో గాంధీ జయంతి అక్టోబర్ 2 రోజు చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ చేపట్టారన్నారు.
సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో చేపట్టాలని అనుకున్న ర్యాలీ కి సీపీ అనుమతి ఇవ్వలేదన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతల పట్ల సీపీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. సీపీపై ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారని చెప్పారు. సత్యాగ్రహ దీక్ష సమయంలో సీపీ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారన్నారు.
తలసాని తల తోక లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఉత్తమ్ పై కామెంట్స్ చేసే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నిబద్దత కలిగిన పైలట్ గా పని చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి దన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యోగాన్ని నిర్వహించారని, మరి తలసాని ఏం చేశారో చెప్పాలన్నారు. తన జీవితాన్ని పణంగా పెట్టారన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఉత్తమ్ సిట్టింగ్ ఎంపీ అన్న విషయం మరిచి పోయి నిరాధారమైన కామెంట్స్ చేశారని ఆరోపించారు. అంతే కాదు జాతీయ పార్టీ పరంగా రాష్ట్ర పార్టీకి ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నారన్న సోయి లేకపోతే ఎలా అన్నారు. తెలంగాణ లోని ప్రతి ఒక్కరికి తెలుసు తలసాని చరిత్ర ఏమిటో. ఆయన పదవి కోసం పార్టీ మారారు.
అంతే కాదు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేశారు. ఆయనకు మాట్లాడే హక్కు లేదన్నారు శ్రవణ్. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను అనరాని మాటలను అనలేదా అన్నారు. ఇప్పుడు పదవి దక్కాక కేసీఆర్ ను పొగడటం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అంజనీ కుమార్ కు ఇక్కడ ఏం పని అని మరోసారి నిలదీశారు.
ఆంధ్రాకు చెందిన ఈ ఐపీఎస్ కు ఇంకా తెలంగాణాలో ఉండటం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం అధికార పార్టీకి తొత్తుగా, నేతలకు అడుగులు మడుగులు ఒత్తుతూ వారు చెప్పినట్లు ఆడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడిన తీరు పై స్పందించారు. నిబద్దతతో పని చేసిన ఐపీఎస్ లు ఉన్నారు. వారిని తమ పార్టీ అనడం లేదు. తల మీద టోపీ ధరించడం అంటే గొప్ప గౌరవంగా భావించాలి. కానీ ప్రస్తుతం తెలంగాణాలో ఐపీఎస్ లు, ఐఏఎస్ లు ఎస్ బాస్ అంటూ ఉన్నారని ఆరోపించారు.
కింది స్థాయి కాన్స్టిబుల్ నుంచి ఎసై, సీఐ, డిఎస్పీ లదాకా టిఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మరి దీనికి పోలీస్ బాస్ ఏం సమాధానం చెబుతారని అన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ని ఎందుకు అనుమతి ఇవ్వలేదో బేషరతుగా ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో అంజాన్ కుమార్ యాదవ్, ప్రేమ్ లాల్, తదితరులు పాల్గొన్నారు.