Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్కూల్ ఫీజుల కోసం వేదిస్తే చర్యలు: మంత్రి తలసాని

స్కూల్ ఫీజుల కోసం వేదిస్తే చర్యలు: మంత్రి తలసాని
, గురువారం, 30 జులై 2020 (16:58 IST)
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు చేపట్టవలసిన తక్షణ చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో 745 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, వాటిలో అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యను అందించాలని, ప్రభుత్వ విద్యనూ బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని అన్నారు.

అందులో భాగంగానే సన్న బియ్యంతో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం, వారంలో 3 రోజలు గ్రుడ్లు  ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అందించాలనేది ప్రభుత్వ ఆశయం అన్నారు.ప్రభుత్వ పాఠశాలలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మీ మీ పరిధిలోని పాఠశాలలలో తనిఖీలు నిర్వహించి పర్నిచర్, క్రీడాసామగ్రి, ప్రహారీ గోడలు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి ఇతర సమస్యలను గుర్తించి నివేదికలను రూపొందించాలని డిప్యూటీలను మంత్రి ఆదేశించారు. నివేదికలు రూపొందించి సమర్పిస్తే ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

10 నుండి 20 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్దులు ఉన్న పాఠశాలలను గుర్తించి వారిని సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఉపాద్యాయులు అధికంగా ఉన్న పాఠశాలల నుండి అవసరమైన పాఠశాలల కు మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యార్దులతో పాటు పాఠశాలల లో మధ్యాహ్న భోజన వసతిని ఉపాద్యాయులకు కల్పించాలని మంత్రి ఆదేశించారు. 

తద్వారా బోజన నాణ్యతపై సరైన అవగాహన ఉంటుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల పై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, దీంతో ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్త్యం చేశారు, అన్ లైన్ క్లాస్ ల పేరుతో విద్యార్ధుల తల్లిదండ్రులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం వేదిస్తున్నాయని, అలాంటి వారిని ఉపేక్షించ వద్దని అన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాలలో వాచ్ మెన్ ను నియమించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్ క్రింద వివిధ ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన పనుల ప్రగతి పై అధికారులతో ఒక కమిటీని వేసి 10 రోజులలో పనులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోరున విలపించిన వైకాపా ఎమ్మెల్యే.. ఎవరు? ఎందుకు?