అమరావతి రైతులు అల్లాడిపోతున్నా కనీసం పట్టించుకోకుండా.. ఏపీ సీఎం జగన్ తో సమావేశమై హైదరాబాద్ వెళ్లిపోయిన సినీప్రముఖులపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుండగా.. తాజాగా బీజేపీ నాయకురాలు యామినీ శర్మ వారిపై విరుచుకుపడ్డారు.
పిరికిపందలు, స్వార్థపరులు అంటూ తీవ్ర విమర్శలు చేయడమే గాక జగన్ తో తమ వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుని వెళ్లారంటూ మండిపడ్డారు. ఓ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ...
"ప్రపంచంలో ప్రజలు చచ్చినా వారికి ఫర్వాలేదు. పిరికితనంగా ఉంటున్నారు. ఒక ప్రాంతంవారి గురించి మాట్లాడితే ఎక్కడ తమ సినిమాలు ఆగిపోతాయనే భయం తప్ప మరొకటి లేదు. చిరంజీవి గొప్ప నటుడు, రాజకీయంగా పేరున్నవారు.
ఖైదీ నంబర్ 150 సినిమా తీసిన చిరంజీవి, ఆ సినిమాలో కార్పొరేట్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల గురించి స్ఫూర్తిదాయకంగా సినిమా తీశారు. మరి అమరావతి రైతులను పట్టించుకోరా? ప్లకార్డులు పట్టుకుని నిలుచుంటే కనీస మాత్రంగానైనా వారి ఆవేదన పట్టించుకోరా? అభిమానులు ఆలోచించుకోవాలి.
సినిమా వాళ్లు అమరావతి విషయంలోనే కాదు, ఏం జరుగుతున్నా సరిగ్గా స్పందించరు. పక్కా వ్యాపారలావాదేవీల గురించి మాట్లాడుకోవడానికే సీఎంతో భేటీ అయ్యారు. పరిశ్రమ మొత్తం తెలంగాణలో ఉందని హైదరాబాద్‌లో ఉంటూ, ఏపీ ప్రజల సొమ్ము అనుభవిస్తూ, ఇక్కడి సమస్యలపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
వారి స్వార్థమే వారిది. ప్రజల సొమ్ముతో అన్నీ అనుభవిస్తున్నప్పుడు.. రియల్ హీరోలు కానవసరం లేదు, మనుషుల్లా ఉండండి చాలు" అని నిప్పులు చెరిగారు.