Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక నిర్ణయం.. 10 రోజుల్లోనే బియ్యం కార్డు: జగన్

Advertiesment
revolutionary decision
, మంగళవారం, 9 జూన్ 2020 (22:17 IST)
సంక్షేమ పథకాల అమలులో ఎపి ప్రభుత్వం కొత్త ఒరవడి తీసుకువచ్చింది. నిర్థిష్ట కాలపరిమితి లోగా సేవలు అందించే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.

అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తామనే కమిట్ మెంట్ పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. అనంతరం ఆయన జిల్లాల కలెక్టర్లు, జెసిలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు.

దరఖాస్తు చేసుకున్న కొద్దిపాటి సమయంలోనే లబ్ధిదారులకు సంక్షేమాన్ని చేరువ చేయాలని ఈ సందర్బంగా అధికారులకు నిర్ధేశించారు. అలా చేయగలమనే నమ్మకంతో ఈ రోజు ఒక విప్లవాత్మక నిర్ణయంకు శ్రీకారం చుట్టామని అన్నారు.

ఈ నిర్ణయం తీసుకునేప్పుడు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారని, ప్రజలకు ఎందుకు అంతగా కమిట్ మెంట్ ఇవ్వాలి, ఇస్తే చేయగలుగుతామో, లేదోనని సందేహం వ్యక్తం చేశారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలకు మనం సంతృప్తస్థాయిలో..పారదర్శకంగా... అవినీతి లేని వ్యవస్థను ... ఎటువంటి వివక్ష లేని వ్యవస్థను అందిస్తున్నప్పుడు..ఖచ్చితంగా కమిట్ మెంట్ ఇవ్వగలమని, అనుమానాలు వ్యక్తం చేసిన వారికి స్పష్టం చేసినట్లు తెలిపారు.

గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు 44 లక్షల  పెన్షన్లు వుంటే, మన ప్రభుత్వం వచ్చిన తరువాత 58 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వెయ్యి రూపాయిలే పెన్షన్ ఇచ్చేవారని, నేడు మనం దానిని రూ. 2250 ఇస్తున్నామని అన్నారు. 

సంతృప్తికర స్థాయి వరకు అర్హులైన వారికి అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు.  రైస్ కార్డుల విషయంలో కూడా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని, అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన పథకాలను సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

రాష్ట్రంలో 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎపిఎల్ తో కలుపుకుంటే.. మొత్తం ఇళ్లు 1.6 కోట్లు వరకు వుంటాయని అన్నారు.  ఇవాళ 30 లక్షలకు పైగా అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని అన్నారు. అంటే  దాదాపు 20 శాతం వరకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని తెలిపారు.

శాచ్యురేషన్ లెవల్ వరకు ఇస్తున్నాం కాబట్టి తరువాత వచ్చే దరఖాస్తులు కూడా తక్కువగానే వుంటాయని అభిప్రాయపడ్డారు. ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకం సేవలు లభించకపోతే తరువాత వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

గతంలో సంక్షేమ పథకాలు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి వుండేదని, దానికి కూడా లంచాలు, రికమండేషన్లు అవసరమయ్యేవని అన్నారు. దానికి భిన్నంగా నేడు అర్హత వుంటే చాలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవుతారని అన్నారు.

గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నామని, జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే... వారు ఎలా తిరిగి వారు దరఖాస్తు చేసుకోవాలో సూచికలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా... అవినీతి లేకుండా... అందరికీ పథకాలను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.

మనకు ఓటు వేయని వారు అయినా సరే, వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలనేది మన లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా 10రోజుల్లో బియ్యం కార్డు, పెన్షన్ కార్డు ఇస్తామనే దానిపై సంతకం  పెడుతున్నానని తెలిపారు. ఇరవై రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు... 90 రోజుల్లో ఇళ్ళ పట్టా ఇస్తామనే కమిట్ మెంట్ పై సంతకం చేస్తున్నానని స్పష్టం చేశారు.

ఈ నిర్ణీత సమయాల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హులు అని తేలితే.. వెంటనే ఖచ్చితంగా నిర్ధిష్ట గడువులోగా కార్డులు ఇవ్వాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే జాయింట్ కలెక్టర్ లకు ప్రత్యేక ఆదేశాలను ఇచ్చామని, జిల్లాల్లో కలెక్టర్లు, జెసిలు దీనికి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.

కలెక్టర్ లు గ్రామసచివాలయాలకు వస్తున్న దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... పర్యవేక్షించాలని, అర్హత వుంటే... ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో సంక్షేమ పథకంను అందిస్తామనే నమ్మకం కలిగించాలని సూచించారు. పదిరోజుల్లో నిర్ధిష్టమైన కారణం వుంటేనే కార్డును నిరాకరించాలని, నిర్ధిష్ట కారణం లేకుండా కార్డు ఇవ్వకపోతే దానిని చాలా తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు.

జెసిలు, కలెక్టర్లు ఖచ్చితంగా దీనిపై మరింత శ్రద్ద తీసుకోవాలని, సరైన కారణం లేకుండా కార్డు నిరాకరిస్తే... దానికి తగిన పరిహారం కూడా మనం ఇవ్వాల్సి వుంటుందని అన్నారు. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న కమిట్ మెంట్ అని మరోసారి గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ చేతి రాతను ఎప్పుడైనా చూశారా?