Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
, శుక్రవారం, 12 జూన్ 2020 (19:18 IST)
కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన కార్యాలయం వద్ద మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు పరిశుభ్రమైన చేపలు, చేపల వంటకాలను అందించేందుకు 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున ఒక మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

దూర ప్రాంతాలలో ఉన్న చేపల మార్కెట్ కు వెళ్లి చేపలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ద్వారా తక్కువ ధరకు చేపలను విక్రయించే అవకాశం ఉంటుందని, వివిధ రకాల చేపల వంటకాలు చేరువ చేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు.

నేషనల్ ఫిష్ డెవలప్ మెంట్ బోర్డ్, తెలంగాణ మత్స్య శాఖల ఆధ్వర్యంలో ఈ వాహనాలను అర్హులైన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ వాహనాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని చెప్పారు.

కులవృత్తుల పై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని, వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం, కల అన్నారు. అందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

గత ప్రభుత్వాలు మత్స్య శాఖ కు నిధులు కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

ఉచితంగా చేపపిల్లల పంపిణీతో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా 2019-20 సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని, ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందని అన్నారు.

అంతేకాకుండా చేపలు విక్రయించుకోవడానికి 65 వేల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లగేజి ట్రాలీలు, వృత్తి పరంగా అవసరమైన వలలు, కేట్స్ ను మత్స్యకారులకు పంపిణీ చేసినట్లు వివరించారు.

రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన నీటి ప్రాజెక్ట్ లతో అనేక నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసి మత్స్య సంపదను పెంచడం ద్వారా మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

రానున్న రోజులలో పెరగనున్న మత్స్య సంపదను మార్కెటింగ్ చేసేందుకు కూడా భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర మంత్రికి కరోనా