మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత అపూర్వ విజయం సొంతం చేసుకున్నారు. అందరూ ఊహించిన దానికంటే.. ఎక్కువ ఓట్లు సాధించి... ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత ఘన విజయం సాధించారు.
మొత్తం 824 ఓట్లు ఉండగా... పోలైనవి 823 ఓట్లు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. వీటిలో... టీఆర్ఎస్ 728 ఓట్లు గెలుచుకుంది. ఆ తర్వాత బీజేపీ 56 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 29 ఓట్లు పొందగా... 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తానికి కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే ఫలితం వెల్లడైంది.
టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ విజయాన్ని సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. నిజానికి పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి తర్వాత 16 నెలలుగా ఆమె ఏ పదవినీ చేపట్టలేదు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పుడే టీఆర్‌ఎస్ తరఫున కవిత నామినేషన్ వేసినప్పుడే గెలుపు ఖాయం అని భావించినా... ఆమెకు భారీ మెజారిటీ వచ్చేలా టీఆర్ఎస్ నేతలంతా కృషి చేశారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఓట్లు చీలకుండా చూశారు. పార్టీ వారితో పాటు ఇతరుల మద్దతు కూడగట్టి భారీగా ఓట్లు పడేటట్లు ప్రయత్నం చేశారు. ఇవాళ కౌంటింగ్‌లో కవితకు అనుకున్న దాని కంటే ఎక్కువ ఓట్లు రావడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.