Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 : లక్ష్య ఛేదనలో చతికిలపడిన చెన్నై ... నైట్ రైడర్స్ రైట్ రైట్

ఐపీఎల్ 2020 : లక్ష్య ఛేదనలో చతికిలపడిన చెన్నై ... నైట్ రైడర్స్ రైట్ రైట్
, గురువారం, 8 అక్టోబరు 2020 (09:11 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా, బుధవారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తన ముందు ఉంచి 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పది పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
మరోవైపు, కీలక మ్యాచ్‌లో చెలరేగిపోతారనుకున్న గిల్ (11), నితీశ్ రాణా (9), నరైన్ (17), రస్సెల్ (2) తీవ్రంగా నిరాశ పరిచారు. కోల్‌కతా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్న మోర్గాన్ (7) ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చినప్పటికీ క్రీజులో కుదురుకోలేకపోయాడు. కెప్టెన్ కార్తీక్ (12) పేలవ ఫామ్ కొనసాగుతుండగా, కమిన్స్ 17 పరుగులు చేశాడు. నాగర్‌కోటి, శివమ్ మావీలు డకౌట్ అయ్యారు. ఇకపోతే, చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టగా, శామ్ కరన్, ఠాకూర్, కర్న్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 
 
ఆ తర్వాత 168 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సింహాలు 157 పరుగుల వద్దే తమ పరుగును నిలిపివేశారు. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్ షేన్ వాట్సన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. అయితే, మరో ఓపెనర్ డుప్లెసిస్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 17 చేస్తూ కాస్త దూకుడుగానే కనిపించారు. దీంతో సీఎస్కేకు విజయం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, 30 పరుగుల వద్ద డుప్లెసిస్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు కూడా బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినప్పటికీ క్రీజులో కుదురుకోలేకపోయాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
webdunia
 
మరోవైపు, క్రీజులో నిలదొక్కుకున్న వాట్సాన్ మాత్రం జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే, అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక నరైన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు. క్రీజులో ధోనీ ఉండడంతో చెన్నై అభిమానులు గెలుపుపై ధీమాగానే ఉన్నారు. కానీ, ధోనీ కూడా మరోమారు విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేయగా, శ్యామ్ కరణ్ 17 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ కావడంతో చెన్నై ఓటమి ఖరారైంది. 
 
చివర్లో రవీంద్ర జడేజా 8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసినప్పటికీ ఓటమి అంతరం తగ్గింది తప్పితే పరాజయం నుంచి జట్టును కాపాడలేకపోయాడు. కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్‌కోటి, సునీల్ నరైన్, రస్సెల్ చెరో వికెట్ తీసుకున్నారు. 81 పరుగులు చేసి జట్టును ఆదుకున్న త్రిపాఠికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో కోల్‌కతా 6 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది.​​​​​

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : చెన్నై సింహాలు వర్సెస్ నైట్ రైడర్స్ (మ్యాచ్ ప్రివ్యూ)