Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 : ఢిల్లీకి తొలి ఓటమి... హైదరాబాద్‌ను గెలిపించిన బౌలర్లు

ఐపీఎల్ 2020 : ఢిల్లీకి తొలి ఓటమి... హైదరాబాద్‌ను గెలిపించిన బౌలర్లు
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:04 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ టోర్నోలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ జట్టును బౌలర్లు గెలిపించారని చెప్పొచ్చు. ముఖ్యంగా, రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ దెబ్బకు ఢిల్లీ జట్టు గింగరాలు తిరిగింది. ఫలితంగా 163 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఢిల్లీ పరాజయం పాలైంది. 
 
మంగళవారం రాత్రి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌‌లో ఆటగాళ్ల మెరుపులు కరవయ్యాయి. ఫలితంగా ఆట చప్పగా సాగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 162 పరుగులు చేసింది. 
 
వరుసగా భారీ స్కోర్లు నమోదవుతూ వస్తున్న వేళ ఈ మాత్రం స్కోరు చేసిన హైదరాబాద్‌కు ఓటమి తప్పదని అందరూ భావించారు. అయితే, రషీద్ ఖాన్ బౌలింగ్ ముందు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు.
 
శిఖర్ ధవన్ (34), శ్రేయాస్ అయ్యర్ (17), రిషభ్ పంత్ (28)లను రషీద్ ఖాన్ వెనక్కి పంపడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. షిమ్రన్ హెట్‌మైయర్ (21) రెండు సిక్సర్లు బాది ఢిల్లీని భయపెట్టినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 
 
రషీద్‌ ఖాన్‌కు తోడు భువనేశ్వర్ జతచేరడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి ఏడు వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ విజయానికి 16 పరుగుల ముందు చేతులెత్తేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ రెండు, ఖలీల్ అహ్మద్, నటరాజన్ చెరో వికెట్ తీశారు.
 
అంతకుముందు హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్, బెయిర్‌స్టోలు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. 
 
ఈ క్రమంలో 33 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేసిన వార్నర్, మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు దొరికిపోయాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న మనీశ్ పాండే (3) ఉసూరు మనిపించాడు.
 
అయితే, జట్టులోకి వచ్చిన విలియమ్సన్‌ తనపై అభిమానులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేదు. బెయిర్‌స్టోతో కలిసి సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్‌స్టో (53) రబడ బౌలింగ్‌లో నోర్ట్‌జేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది.
 
క్రీజులో ఉన్న విలియమ్సన్ మాత్రం బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును 160 పరుగులు దాటించాడు. 26 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసిన విలియమ్సన్, రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అబ్దుల్ సమద్ సిక్సర్, ఫోర్‌తో 12 పరుగులు చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి162 పరుగుల నామమాత్రపు స్కోరు చేయగలిగింది. మూడు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించిన రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై జట్టులో చేరనున్న 'ఇద్దరు మొనగాళ్లు'