చినజీయర్ కు కారు డ్రైవరుగా మారా: కేసీఆర్

మంగళవారం, 29 అక్టోబరు 2019 (07:57 IST)
"నాకు చినజీయర్ స్వామితో అంతకుముందెప్పుడూ పరిచయం లేదు. 1986 -87 సంవత్సరంలో సిద్దిపేటలో బ్రహ్మ యజ్ఞం చేయాలని తలపెట్టారు. వికాస తరంగిణి సభ్యలంతా నా దగ్గరకు వచ్చి, ఇది మంచి కార్యక్రమమని, తప్పకుండా చేయాలని అన్నారు.

అందుకు నేను ఒప్పుకున్నాను. అప్పుడు బ్రాహ్మణ పరిషత్తు లేదు. స్వామీజీ ఉండటానికి సరైన చోటు లేదు. దీంతో స్వామిని మా ఇంట్లోనే ఉంచాలన్నారు. అందుకు స్వామి అనుగ్రహించారు. ఆయన ఏడు రోజులు మా ఇంట్లోనే బస చేశారు. ఆ సమయంలో నేను స్వామీజీకి కారు డ్రైవరుగా మారాను.

ఆయన్ని పలు ఆలయాలకు తీసుకెళ్ళాను" అని సీఎం కేసీఆర్ చెప్పారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరై చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సత్యసంకల్ప గ్రంథాన్ని చినజీయర్ స్వామి బహుకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “భగవంతుడిని పూజించే సంస్కారం మా తల్లిదండ్రుల పరంపర నుంచి వచ్చింది. దేవాలయం అంటే భగవంతుడిని ఆరాధించే కమ్యూనిటీ హాల్.

సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే గురువారెడ్డి కమ్యూనిస్టు అయినప్పటికీ రామాలయం నిర్మించారు. హైందవ సంప్రదాయంలో ఉండే శక్తి చాలా మందికి తెలియదు. హిందూ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు జీయర్ స్వామిలాంటి వారు ఉన్నారు.

బీబీ నాంచారమ్మ జన్మవృత్తాంతం చాలా మందికి తెలియదు. యాదాద్రి ఆలయం పూర్తి కావొస్తోంది. ఆలయం పనులు ఇంకా జరుగుతున్నాయి. భక్తులు బాలాలయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన ఆలయం ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని భావిస్తున్నా.

ప్రధాన ఆలయం ప్రారంభం సందర్భంగా 1,008 కుండలాలతో మహాసుదర్శన యాగం నిర్వహిస్తాం. ఈ యాగం కోసం ప్రపంచ వైష్ణవ పీఠాలను ఆహ్వానిస్తాం. మహాసుదర్శన యాగంతో పాటు రామానుజ స్వామి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తాం" అని తెలిపారు. అలాగే కేసీఆర్ చినజీయర్ స్వామితో అనుబంధాన్ని వివరించారు.

"నేను చినజీయర్ స్వామితో ఉండటంవల్ల ఆయన అనుగ్రహ భాషణలు నన్ను ఆకట్టుకున్నాయి. భగవద్ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపనలో నేనూ సేవకుడిలా పాల్గొంటాను” అన్నారు ముఖ్యమంత్రి. తన వివాహం గురించి మాట్లాడుతూ…. "నాది బాల్య వివాహం. 14 ఏళ్లకే వరంగల్ జిల్లా చిత్తలూరులో నా పెళ్లయింది.

ఆ రోజుల్లో గురువులు వస్తే మాకందరికీ పండుగే. వారు వస్తే నెల రోజులు మా ఇంట్లోనే ఉంటూ గ్రామస్తులకు భారతం, భాగవతం చెప్పేవారు. ఆ గురువులే సంస్కారవంతంగా తీర్చి దిద్దారు. అప్పటి నుంచి భక్తి పరంపర కొనసాగుతూనే ఉంది" అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అనాధల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్న గవర్నర్ బిశ్వభూషణ్