ఇటీవల క్లౌడ్ బరస్ట్ కారణంగా ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23 మంది జవాన్లు కూడా గల్లంతయ్యారు. అనేక మంది స్థానికలు ఆచూకి తెలియలేదు. ఈ వరదల పుణ్యమాన్ని రోడ్లు, ఇల్లు కూలిపోయాయి. తాజాగా ఓ విషాదకర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వరదల్లో అలనాటి నటి, ప్రముఖ కూచిపూడి నర్తకి సరళ కుమారి సిక్కింలో గల్లంతయ్యారు.
తన తల్లి ఆచూకీ కనిపెట్టాలంటూ అమెరికాలో ఉంటున్న సరళ కుమారి కుమార్తె తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1983లో 'మిస్ ఆంధ్రప్రదేశ్'గా ఎంపికైన సరళ కుమారి ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దాన వీర శూర కర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
ఈ నెల రెండో తేదీన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి కుమార్తెకు కూడా సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఓ హోటల్లో వారు బస చేసినట్లు తెలిసింది. అయితే సిక్కింలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ నెల 3న చివరిసారిగా ఆమె తన కుమార్తెతో మాట్లాడారు.
ఇదిలావుండగా, ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ నీరడి గంగాప్రసాద్ భౌతికకాయం శనివారం స్వగ్రామం నిజామాబాద్ జిల్లా బోధన్, కుమ్మంపల్లెకు చేరుకుంది. మరోవైపు, సిక్కిం వరదల్లో 3 వేల మందిపైగా పర్యాటకులు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు వైమానిక దళం పలుసార్లు ప్రయత్నించినా.. ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. అయితే, పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.