ఆ దున్నపోతుకు వారానికి ఒకసారి బాదం నూనెతో బాడీ మసాజ్ చేస్తారు. అలాగే, వారంలో ఒక రోజు ప్రీమియం స్కాచ్ తాగిస్తారు. ప్రతి రోజూ మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, యాపిల్స్‌ను తినిపిస్తారు. ఇంతకీ ఆ దున్నపోతు ప్రత్యేక ఏంటనే కదా మీ సందేహం..
అయితే, ఈ కథనం చదవండి... ప్రతి యేటా హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల కోసం ఆరేండ్ల వయసున్న ఈ బాహుబలి దున్నను హర్యానా నుంచి తీసుకొచ్చారు. దీన్ని సదర్ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు.
ఈ దున్నపోతును ప్రతి రోజు 3 కిలోమీటర్ల మేర వాకింగ్‌కు తీసుకెళ్తారు. ప్రతి ఆదివారం స్విమ్మింగ్‌కు కూడా తీసుకెళ్తారు. స్విమ్ చేసిన తర్వాత తనంతట తానే ఇంటికి తిరిగి వస్తుంది. ఈ దున్న నిర్వహణకు ప్రతి రోజు రూ.7 వేలు ఖర్చు చేస్తారు. దీని పరిరక్షణ కోసం ముగ్గురు సిబ్బందిని విధుల కోసం నియమించారు.
అలాగే, రోజుకు 25 లీటర్ల పాలను తాగేస్తోంది. ప్రతి శనివారం బాదం నూనెతో బాడీ మసాజ్ చేస్తారు. వారంలో ఒక రోజు ప్రీమియర్ స్కాచ్ తాపిస్తారు. స్కాచ్ ఇవ్వడం వల్ల ఆ దున్నకు మంచి ఆరోగ్యాన్ని, జీర్ణవ్యవస్థ సరిగా ఉండేందుకు సహాయపడుతుందని నిర్వాహకులు చెప్పారు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దున్నపోతు హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఇంతకీ ఈ బాహుబలి దున్న 7.5 ఫీట్ల పొడవు, 18 ఫీట్ల వెడల్పు ఉంది. 2000 కేజీల బరువు ఉంది.