తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వారం రోజుల పాటు ఎండలు నిప్పుల కొలిమిగా మారనుంది. ఈ వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 44 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదిలావుంటే, ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.