Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒడిషా రైలు ప్రమాదం : ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ అంటే ఏమిటి?

train accident
, ఆదివారం, 4 జూన్ 2023 (15:56 IST)
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పే కారణమని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. అయితే, ఏ రకంగా ఇది ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. తుది నివేదిక వచ్చాక కారణం తెలుస్తుందని చెప్పారు. అప్పుడే ప్రమాదానికి గల కారకులను, ప్రమాద పరిస్థితులను ఖచ్చితంగా వెల్లడించగలమన్నారు. రైల్వేలో ప్రమాదాల నివారణకు ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుంది. 
 
ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్‌ వ్యవస్థ ఇది. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం.. సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటం దీని ప్రాథమిక విధి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తనిఖీల్లో తేలేవరకు రైలుకు సిగ్నల్స్‌ ఇవ్వకుండా ఆపి ఉంచుతుంది. 
 
ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన అనంతరం రైళ్లు ఢీకొనడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దీంతోపాటు రైల్వే ఆపరేషన్లలో భద్రత మరింత బలోపేతం అయింది. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణకు ఈ వ్యవస్థ ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ, కంప్యూటర్లను వినియోగించుకొంటుంది. గతంలో మాన్యూవల్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థతో భర్తీ చేశారు. గతంలో సిగ్నల్స్‌ను నియంత్రించడానికి రాడ్లు, స్విచ్‌లను వినియోగించేవారు. 
 
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో వేగంగా స్పందించే అవకాశం, రైళ్ల నియంత్రణకు సౌకర్యవంతంగా ఉండటం, ఖచ్చితత్వం వంటి సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో ట్రాక్‌పై రైళ్ల లొకేషన్లు గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్‌బ్యాకింగ్‌ పరికరాలు వాడతున్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ సురక్షితను పెంచేందుకు ట్రైన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌, సిగ్నల్స్‌, పాయింట్స్‌, ట్రాక్‌ సర్క్యూట్స్‌ వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. 
 
దీంతో వాటిని సమన్వయం చేసుకొంటూ ఏకకాలంలో ఒకే మార్గంపై రెండు రైళ్లు రాకుండా చూస్తుంది. రూట్‌ సెట్టింగ్‌, రూట్‌ రిలీజ్‌, పాయింట్‌ ఆపరేషన్స్‌, ట్రాక్‌ ఆక్యూపెన్సీ మానిటరింగ్‌, ఓవర్‌లాప్‌ ప్రొటెక్షన్‌, క్రాంక్‌ హ్యాండిల్‌ ఆపరేషన్స్‌, లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ ఇంటర్‌లాకింగ్‌, ప్రొవిజన్‌ ఫర్‌ బ్లాక్‌ వర్కింగ్‌ వంటి పనులను చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒరిస్సా రైలు ప్రమాదానికి మూల కారణం అదే : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్