తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. మంగళ, బుధవారాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో ఎండలు సెగలుకక్కాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మరణించారు.