తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కన్నతల్లిని కుమార్తె రోకలి బండతో దారుణంగా కొట్టి చంపేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లోనే ఒక గదిలో కుమార్తె నాగం హరిత(28) వేరుగా ఉం టోంది. తల్లి, కుమార్తె మధ్య గత కొన్నేళ్లుగా కుటుంబ విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం మృతురాలి రెండో కుమార్తె అరుణ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కి వచ్చిన వారిని నాగం నర్సు దుర్భాషలాడింది. ఆ విషయంలో మృతురాలికి, పెద్ద కుమార్తె హరితకు గొడవ జరిగింది. ఈ గొడవలో కుమార్తె తల్లిని రోకలి బండతో ఇష్టం వచ్చినట్లు తల, ముఖంపై కొట్టి పడేసి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు 27వ తేదీన జరిగిన విషయాన్ని మృతురాలి పెద్ద కుమార్తె తన చెల్లెలికి, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. మధ్యాహ్నం మృతురాలి రెండో కుమార్తె, బంధువులు వచ్చి చూడగా నర్సు చనిపోయి ఉంది. మృతురాలి మేనల్లుడు గణపురం రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.