తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) టోల్ వసూలు లీజ్‌కు సంబంధించి ఐఆర్‌బీ సంస్థ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఈ పరువు నష్టం దావా నోటీసులను పంపించింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్(ఓఆర్‌ఆర్) రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ డెవలపర్స్ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓఆర్‌ఆర్ టోలింగ్, నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ ఒప్పందంలో అవకతవకలు, అవినీతి జరిగిదంటూ రఘునందన్ రావు ఆరోపణలు చేయడంతో ఆగ్రహించిన ఐఆర్‌బీ సంస్థ ఈ నోటీసులను పంపించింది.