Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీ స్ఫూర్తితో తెలంగాణ సాధన... కె సి ఆర్

Advertiesment
గాంధీ స్ఫూర్తితో తెలంగాణ సాధన... కె సి ఆర్
, బుధవారం, 2 అక్టోబరు 2019 (15:42 IST)
జాతిపిత మహాత్మాగాంధి చూపిన అహింస, సత్యాగ్రహ దీక్షల స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని శాంతి యుతంగా నడిపి, స్వరాష్ట్రం సాధించగలిగామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు తాను చేసిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా తెలంగాణ ప్రజలంతా చూపిన సహనం, అహింసా మార్గం దేశానికి మార్గదర్శకంగా మారిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్ష నేపథ్యంతో సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ ఏడేళ్ల క్రితం రాసిన ‘జ్వలితదీక్ష’ నవల రెండో ముద్రణను మహాత్మాగాంధి 150వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు.

జ్వలిత దీక్ష మొదటి ముద్రణను సుగుణ ఫిల్మ్స్ అండ్ పబ్లిషర్స్ ప్రచురించగా, రెండో ముద్రణను ప్రముఖ రచయిత, బిసి కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ ఆధ్వర్యంలోని అడుగు జాడలు పబ్లికేషన్స్, సుగుణ ఫిల్మ్స్ అండ్ పబ్లిషర్స్ సంయుక్త ఆధర్వంలో రెండో ముద్రణ వెలువడింది.

ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధి తన అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాల ద్వారా దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, స్వతంత్ర్యం సాధించగలిగారని అన్నారు. 2009లో తాను నిరాహార దీక్ష చేపట్టినప్పుడు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో నెలకొన్న పరిస్థితులను, తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న భావోద్వేగ సన్నివేశాలను జ్వలితదీక్ష పుస్తకంలో రచయిత విజయ్ కుమార్ గొప్పగా అక్షరీకరించారని అన్నారు.

దీక్ష సందర్భంలో తన మదిలో మెదిలిన భావనలను తన అంతరంగంలోకి తొంగి చూసినట్లే రచయిత ఆవిష్కరించారని చెప్పారు. మొదటి ముద్రణ ఎంతో ప్రజాదరణ పొందిన జ్వలిత దీక్ష రెండో ముద్రణ బాధ్యత తీసుకున్న గౌరీశంకర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా సాధిస్తామని టిఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్ళలోనే తాను ప్రకటించానని, ఆ మార్గం వీడకుండా గమ్యం చేరుకున్నామని సిఎం అన్నారు. తెలంగాణలో సాగిన శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం భారత ప్రజాస్వామిక వ్యవస్థపై నమ్మకం పెంచిందని, గాంధీ మార్గానికి మరింత సార్థకతను చేకూర్చిందని వివరించారు.

ఈ పుస్తకంతో పాటు ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రాసిన తెలంగాణలో గాంధి, మహాత్మాగాంధి ఇన్ తెలంగాణ అనే పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జ్వలిత దీక్షకు కేసీఆర్ తో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ ముందు మాటలు రాశారు.

 
ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి, సిఎం సిపిఆర్వో వనం జ్వాలా నరసింహారావు, పిఆర్వోలు రమేశ్ హజారి, మిట్ట సైదిరెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో 5 నుంచి ఆర్టీసీ సమ్మె