తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం కొత్త భవన నమూనా చిత్రాన్ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది.
చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింభిస్తోంది. ప్రస్తుత పాత సచివాలయ ప్రాంగణం 25.5 ఎకరాల విస్తీర్ణంలో గత 1950లో నిజాం వంశస్థులు నిర్మించారు. ఆ తర్వాత కొన్ని బ్లాకులను అంచలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు.
కాగా, నూతన సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా, పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది.