Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్షోభంలో తెలంగాణ గ్రానైట్

సంక్షోభంలో తెలంగాణ గ్రానైట్
, శనివారం, 16 నవంబరు 2019 (08:25 IST)
తెలంగాణలో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో దాదాపు పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి.

జీఎస్‌టీ, డీజిల్‌ ధరలతో పాటు క్వారీలకు అనుమతులు రాకపోవడం, రాయల్టీ మీద రిబేట్‌ రద్దు తదితర సమస్యలు గ్రానైట్‌ పరిశ్రమను దెబ్బతీస్తున్నాయి.
 
తెలంగాణలో గ్రానైట్‌ పరిశ్రమ కుదేలవుతోంది. కర్ణుడి చావుకు వేయి కారణాలు అన్నట్టు.. గ్రానైట్‌ పరిశ్రమలు మూతపడడానికి అనేక సమస్యలు గుదిబండలా మారాయి. నాణ్యమైన ముడిసరకు విదేశాలకు ఎగుమతి అవుతుండడంతో ఇక్కడి వాటికి పెద్దగా డిమాండ్ ఉండడం లేదు.

దీనికితోడు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రోత్సహాకాలు లేకపోవడం. జీఎస్టీ బాదుడు, డీజిల్‌ ధరలు పెరగడం పరిశ్రమలను కోలుకోలేని దెబ్బతిస్తోంది. 18 శాతం జీఎస్టీతో గ్రానైట్‌ను కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు.
 
అసలే కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పరిశ్రమకు ప్రభుత్వ నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. రాయల్టీ మీద రిబేట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. అంతే కాకుండా గత ఐదేళ్లుగా రావాల్సిన రాయల్టీని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ మొత్తం రూ.30కోట్లకు పైగానే ఉంది. దీంతో పరిశ్రమలు బ్యాంకులకు రుణాలను చెల్లించలేకపోతున్నాయి.
 
గ్రానైట్‌ పరిశ్రమలు మూత పడుతుండడంతో అటు పారిశ్రామికవేత్తలతో పాటు.. వాటిపై ఆధారపడి బతికే వేతన జీవులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధిలేక వేలాది మంది కార్మికులు రోడ్డునపడుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 70శాతం పరిశ్రమలు మూత పడడానికి సిద్ధంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
 
గ్రానైట్‌ పరిశ్రమను ప్రభుత్వం ఆదాయ వనరుగా భావించకుండా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమగా గుర్తించి సమస్యలను పరిష్కరించాలని యాజమానులు కోరుతున్నారు. గ్రానైట్‌పై రాయల్టీని ఎత్తివేయాలని.. సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలంటున్నారు.

కొత్త క్వారీలకు అనుమతులు మంజూరు చేయాలని పరిశ్రమల యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని నిర్మాణాలలో గ్రానైట్ వాడకం తప్పని సరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 లక్షల ఇళ్లు అడగండి: ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం