Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 14 January 2025
webdunia

ఎయిరిండియాలో సంక్షోభం

Advertiesment
ఎయిరిండియాలో సంక్షోభం
, సోమవారం, 14 అక్టోబరు 2019 (07:53 IST)
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాలో సంక్షోభ పరిస్థితి నెలకొనే అవకాశముంది. పైలట్లు మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. తమ వేతనాల పెంపు, ప్రమోషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరికి అసంతృప్తి చెందిన వారు ఆ ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.

అదే జరిగితే ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతతో తగ్గిన విమాన సర్వీసుల సమస్య మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. దానికి తోడు విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలు కూడా చుక్కలనంటవచ్చు. తమ డిమాండ్ల విషయం ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాలు నడిపే 120 మంది పైలట్లు ఇప్పటికే రాజీనామా పత్రాలు సమర్పించినట్టు చెబుతున్నారు.

ఇప్పటికే రూ.60 వేల కోట్ల రుణాల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పైలట్లు ఈ చర్యకు దిగారని ఇటీవల రాజీనామా చేసిన ఒక పైలట్‌ చెప్పారు.
 
తాము వేతనాలు, ప్రమోషన్ల కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నామని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గట్టి హామీ ఏదీ లేదని ఆయన అన్నారు. ఇస్తున్న ఆ కాస్త వేతనం కూడా సరైన సమయంలో అందకపోవడం వల్ల తాము భారీ ఎత్తున రుణాలు బకాయి పడిపోయామని ఆయన చెప్పారు.

తమను ఐదేళ్ల కాలానికి తక్కువ వేతనాలకు కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమించారని, అనుభవం గడిస్తున్న కొద్ది వేతనం పెంచకపోతారా, ప్రమోషన్లు ఇవ్వకపోతారా అనే తమ ఆశ అడియాసగానే మిగిలిపోయిందని ఆయన వాపోయారు.

ఎయిరిండియాలో తాము రాజీనామా చేసినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, మార్కెట్‌లో అవకాశాలు అపారంగా ఉన్నందు వల్ల ఏదైనా ప్రైవేటు విమానయాన సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం లభిస్తుందని వారంటున్నారు. ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఆసియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ ఏ-320 విమానాలు నడుపుతున్నాయి.
  
ఈ మూకుమ్మడి రాజీనామా వల్ల విమాన సర్వీసులకు అంతరాయం కలగవచ్చునా అన్న ప్రశ్నకు తమ వద్ద మిగులు సంఖ్యలో పైలట్లున్నారని, వారి రాజీనామాల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం ఏదీ లేదని ఎయిరిండియా ప్రతినిధి ఒకరన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 2,000 మంది పైలట్లుండగా వారిలో 400 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్‌ పైలట్లున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాయమవుతున్న తీరం.. ముంచుకొస్తున్న ముప్పు