Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 లక్షల ఇళ్లు అడగండి: ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

12 లక్షల ఇళ్లు అడగండి: ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం
, శుక్రవారం, 15 నవంబరు 2019 (20:45 IST)
పోలవరం సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల అంశాలను పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని సీఎం వైయస్‌.జగన్‌ వైయస్సార్‌సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

పోలవరం, రెవిన్యూలోటు, విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలు, ప్రస్తతం ఉన్న స్థితిగతులను సీఎం ఎంపీలకు సవివరంగా తెలియజేశారు. ప్రత్యేకహోదా డిమాండ్‌ వినిపించాలన్నారు.

ఎంపీలపరంగా వైయస్సార్‌సీపీ లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీ అని, ఆ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం వినియోగించాలని సీఎం సూచించారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. 
 
ప్రత్యేక హోదా అంశంపై మన డిమాండ్‌ను వినిపించాలని సీఎం జగన్‌ ఎంపీలకు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టుకోసం ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 11,800 కోట్లు ఖర్చుచేశామని, అందులో రూ.8,577 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు.

కేంద్రం గత వారం రూ.1850 కోట్లు  ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ,3222 కోట్లు రావాల్సి ఉందన్నారు. అలాగే సవరించిన అంచనాల ప్రకారం రూ.55,549.87 కోట్లకు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకుండా పనులు చేశారని, దీనివల్ల 4 నెలల కాలంగా పనులు చేయలేకపోయామని సీఎం చెప్పారు.

వచ్చే జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాం పూర్తవుతుందని, స్పిల్‌వే పనులు వెనువెంటనే పూర్తిచేయడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. కాఫర్‌ డ్యాం పూరై్తతే 41.5 మీటర్ల వరకూ నీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉంటాయని, దీనివల్ల సంబంధిత గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఈ సమస్యను నివారించడానికి వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ ఏడాది పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకోసం రూ.10వేల కోట్లు, నిర్మాణ పనులకోసం రూ.6 వేల కోట్లు, గతంలో ఉన్న బకాయిలు రూ. 3,222 కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఆయన ఎంపీలకు చెప్పారు. 
 
రాష్ట్ర విభజన నాటికి కాగ్‌ లెక్కల ప్రకారం రూ.22,948.76 కోట్ల లోటు ఉందని తేల్చారని, ఇప్పటివరకూ 3,979 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని సీఎం ఎంపీలకు వివరించారు. ఈ నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. 
 
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడ్డ ఏడు జిల్లాలకు ఏడాదికి రూ. 350 కోట్ల చొప్పున ఇప్పటివరకూ రూ.7530 కోట్లు ఇవ్వాల్సి ఉందని, కాని రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని మిగిలిన నిధులకోసం గట్టిగా కోరాలన్నారు. 

ఉపాధిహామీ కింద పెండింగు బకాయిలు రూ. 2,246 కోట్లు రావాల్సి ఉందని, అలాగే పీఎంజీఎస్‌వై కింద చేపట్టే రోడ్ల నిర్మాణ దూరాన్ని 3,285 నుంచి 6,135 కి.మీ.కు పెంచాలని కోరామని దీన్ని కూడా సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. 

కొత్త జాబితా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్లను మంజూరుచేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం ఎంపీలకు వివరించారు. ఈ సమయంలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకోసం కేంద్ర ప్రభుత్వం విధించిన అర్హతలు కారణంగా రాష్ట్రంలో చాలామంది పేదలకు ఇళ్లురాకుండా పోతున్నాయని ఎంపీలు ప్రస్తావించారు.

సెల్‌ఫోన్, మోటారు సైకిల్‌ ఉన్నా ఇల్లు ఇవ్వడంలేదని, అర్హతలను సడలించడంపైనా సమావేశంలో చర్చజరిగింది. అర్హతలను మార్చాలంటూ కేంద్రానికి లేఖ రాద్దామని సీఎం ఎంపీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా ఇవ్వనున్న బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ, ఫీజురియింబర్స్‌మెంట్, పెన్షన్‌ కార్డులకు అర్హతలను సడలించామని సీఎం ఎంపీలకు తెలిపారు.

గతంలో రేషన్‌ పొందాలంటే ఆదాయపరిమితి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250  ఉండేదని ఇప్పడు అది రూ.10వేలు, 12వేలుకు పెంచామని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కొత్తగా 7 మెడికల్‌ కాలేజీల కేటాయింపునకు అనుమతిని సాధించాలని సీఎం ఎంపీలకు చెప్పారు. 

రామాయపట్నంలో నిర్మించ తలపెట్టిన పోర్టుకు కేంద్రం సహాయాన్ని కోరాలని, ఈ అంశాన్ని శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ట్రైబల్‌యూనివర్శిటీని విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో ఏర్పాటుకు మార్పు చేసే అంశంపై ఆమోదం కోసం ప్రయత్నం చేయాలని సీఎం ఎంపీలకు నిర్దేశించారు. 

గోదావరి – కృష్ణ నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతున్నా, పథకాల అమల్లో వివక్షతకు తావులేకుండా పారదర్శక పాలన జరుగుతున్నా ప్రతిపక్ష టీడీపీ నిరంతరం బురదజల్లే ప్రయత్నంచేస్తోందని, పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్నిబలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. 

లోకసభ సభ్యుల సంఖ్యా బలం చూసుకుంటే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ అని, వచ్చే రోజుల్లో మరిన్ని రాజ్యసభ సీట్లు పార్టీకి వస్తాయని, పార్లమెంటులో పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి గట్టిగా పనిచేయాలని ఎంపీలకు దిశానిర్దేశంచేశారు. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినందుకు సీఎంకు ఎంపీలు ధన్యవాదాలు తెలియజేశారు. మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ మహర్దశను తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దుతున్నారంటూ సీఎంకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి ఈ సందర్భంలో ముఖ్యమంత్రికి సరస్వతీ విగ్రహాన్ని బహూకరించారు. 
స్థానిక సంస్థల ఎన్నికల తర్వవాత నామినేటెడ్‌ పోస్టులను భర్తీచేస్తామని, అలాగే జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం ఎంపీలతో అన్నారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేతోపాటు నలుగురైదుగురు ముఖ్యమైన నాయకుల్ని త్వరలో కలుస్తానని సీఎం ఎంపీలకు చెప్పారు. 
 
సమావేశానికి 21 మంది లోక్‌సభ, 1 రాజ్యసభ సభ్యుడు హాజరయ్యారు. వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీనేత మి«థున్‌రెడ్డి సహా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, అరుకు ఎంపీ మాధవి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగాగీత, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజయ్,

నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ.సత్యన్నారాయణ, బాపట్ల ఎంపీ సురేష్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్, అమలాపురం ఎంపీ అనూరాధ, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఏలూరు ఎంపీ శ్రీధర్, నర్సరావుపేట ఎంపీ రఘురామకృష్ణం రాజు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అనంతపురం ఎంపీ రంగయ్య, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫక్తు రాజకీయ నేతగా గౌతం గంభీర్? ప్రజా మీటింగ్‌ల కంటే ప్రైవేట్ కార్యక్రమాలకే ప్రాధాన్యత!