తనపై కోపంతో ప్రజావేదిక కూల్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇంకా కోపం ఉంటే ఏమైనా చేయండి.. పేదవాళ్లకు అన్యాయం చేస్తారా? ఇసుక లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. ఇసుకదీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఇసుక ఇవ్వడానికి వారోత్సవాలు పెట్టాలా అని నిలదీశారు. వైసీపీ నేతల ప్రమేయం లేకుండా ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లిందా అని మరోసారి ప్రశ్నించారు. స్వయంగా మీ మంత్రులే చెబుతున్నారని, ముఖ్యమంత్రికి వెనుకబడిన వర్గాలంటే చాలా కోపమని ఆరోపించారు.
వెనుకబడిన వర్గాలు టీడీపీకి వెన్నెముక అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దుర్మార్గుడికి దుర్మార్గమైన ఆలోచనలే వస్తాయని. ఇది జగన్ కావాలని తయారు చేసిన పాలసీ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
‘‘డబ్బులకు కక్కుర్తి పడి ఈ పాలసీ తెచ్చారు. నా ఇంటి మీద నీళ్లు పెట్టాలని లంక గ్రామాలు ముంచేశారు. తప్పు అని నిలదీస్తే దాడి చేస్తారా? జగన్‌కు మనుషుల విలువ తెలియదు. బాబాయ్‌ని చంపేస్తే ఇంత వరకు నిందితుల్ని పట్టుకోలేదు. 14 ఏళ్లు సీఎంగా చేశాను. నాకు అధికారం ముఖ్యం కాదు. జగన్ దొంగ లెక్కలు రాసుకుంటున్నాడు.
రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని జగన్ చూస్తున్నాడు. గోడౌన్లలోని ఆధునిక పనిముట్లను కూడా ఇవ్వడంలేదు. గతంలోనూ ఇసుకకు ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ ఉంది. ప్రజల్ని మోసం చేయడానికి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. సీఎంకు దృఢసంకల్పం లేనంత వరకు వైసీపీ ఆంబోతులు కంట్రోల్ కారు. ఆరోగ్యశ్రీ ఎక్కడ అమలవుతుందో చెప్పాలి.
గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో పారదర్శకత అన్నారు.. వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ప్రశ్నాపత్రం టైప్ చేసిన అమ్మాయికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది’’ అని చంద్రబాబు ఆరోపించారు. బంగారు గుడ్డుపెట్టే బాతులాంటి రాజధానిని అప్పగిస్తే సింగపూర్ సంస్థలు వెనక్కి వెళ్లిపోయేలా చేశారని ఏపీ సీఎం జగన్‌పై మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని, అంబానీ, ఆదానీల పెట్టుబడులు వెనక్కిపోయాయని ఆయన మండిపడ్డారు. కియా అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలకు పోయాయని ధ్వజమెత్తారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.
అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌గా తయారు చేయాలనుకున్నామని, తనలాంటి దృఢ సంకల్పం ఉండే వ్యక్తిని కదిలించలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఠా కక్షలపై పోరాడానని, మత కలహాలు లేని నగరంగా హైదరాబాద్‌ను తయారు చేశామని ఆయన చెప్పారు.
బాంబు దాడులకే తాను భయపడలేదని, పెట్టుబడులు అన్నీ ఏపీ వదిలి వెళ్లిపోతున్నాయన్నారు. సింగపూర్ వెళ్లిపోయిందని, అది మళ్లీ వస్తుందా?, అభివృద్ధి జరుగుతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎంతో కష్టపడి లూలూ కంపెనీని ఏపీకి తెచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
విశాఖలో పెట్టుబడులు పెట్టించడానికి ఒప్పించామని, వెంకయ్యనాయుడు కూడా చొరవ తీసుకున్నాకే లూలూ వచ్చిందని వెల్లడించారు. అలాంటి కంపెనీ కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి రాకుండా పోయాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తాను పోరాడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.
విపరీతంగా డబ్బులు ఖర్చు చేసి గెలవడం, ఆ డబ్బు రాబట్టుకునేందుకు దోపిడీ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమని, ప్రజలకు అండగా ఉండటం సామాజిక బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
ప్రతి పనిలో మీకు జే ట్యాక్స్ కావాలా అని నిలదీశారు. ఇసుక దోచుకోవడానికి జగన్ మనుషుల్ని పెట్టాడని ఆరోపించారు. సిమెంట్ కంపెనీలను కూడా బెదిరించారని, నెల రోజుల్లోపు సిమెంట్ ధర రూ.110 పెంచడం ఎప్పుడైనా చూశామా అని మరోసారి ప్రశ్నించారు.
జగన్‌కి డబ్బులిస్తే రాష్ట్రాన్ని లూటీ చేసినా పర్వాలేదని.. సిమెంట్ కంపెనీలు అనుకుంటున్నాయని తెలిపారు. నిర్మాణ రంగంలో ఎవరికీ పనిలేకుండా పోయిందని, కార్మికులు అర్థ ఆకలితో అలమటిస్తుంటే.. సీఎం మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమత్తారు. మద్యాన్ని నియంత్రించాల్సిన పోలీసులే.. మద్యం అమ్మకాల్లో బిజీ అయిపోయారని చంద్రబాబు విమర్శించారు.
‘‘ఈ సీఎంకు డబ్బు పిచ్చి ఉంది. ఏదో ఒక రోజు మీ ఆస్తులను కూడా ఈ సీఎం బలవంతంగా రాయించుకుంటాడు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక అందించాం. పేదవాడి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ.. మీకు కావాల్సింది మాత్రం డబ్బులే. 35 లక్షల కుటుంబాల కోసం మేం దీక్ష చేస్తుంటే మా పార్టీలోని ఇద్దరు నేతలను చేర్చుకుంటారా?
జగన్‌లాంటి కుటిల రాజకీయ నాయకుల్ని వేలమందిని చూశాను. మీ కుట్రలు, కుతంత్రాలు నా దగ్గర సాగవు. వందమంది నాయకులను తయారు చేస్తాను. రాజకీయం అంటే తమాషా అనుకుంటున్నారా?
ఇది జగన్ కావాలని తయారు చేసిన పాలసీ. డబ్బులకు కక్కుర్తి పడి ఈ పాలసీ తెచ్చారు. నా ఇంటి మీద నీళ్లు పెట్టాలని లంక గ్రామాలు ముంచేశారు. తప్పు అని నిలదీస్తే దాడి చేస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.