నిరుపేదల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పంతో జిహెచ్ఎంసి పరిధిలో ఎంపిక చేసిన 111 ప్రాంతాల్లో ఒక లక్ష గృహాల నిర్మాణ లక్ష్యం త్వరలో నెరవేరనుంది. ఆర్.సి పురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ క్రింద చేపట్టిన 15,600 గృహాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్టు ఇదే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కమిషనర్ ప్రోద్బలంతో హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి సంకల్పించిన లక్ష్యాన్ని నెరవేర్చారు.
రూ. 1422.15 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన అపార్ట్‌మెంట్లకు తీసి పోకుండా సకల హంగులతో నిర్మించారు.
మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసి ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులకు నీటి అందించేందుకు అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసారు.