తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా వైరస్ బారిపడ్డారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
నిజానికి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ మరింత కరాళ నృత్యం చేస్తోంది.
ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ బారిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా వైరస్ చేతికి చిక్కారు. అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
కాగా, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడిన విషయం విధితమే. ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో మిగతా ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది.