కోవిడ్-19 విజృంభించడంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పరీక్షలన్నీ రద్దు అయ్యాయి. ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. అలాగే పదవ తరగతి పరీక్షలపై కూడా ఒక స్పష్టత ఇచ్చారు.
ఇంకా చాలా పరీక్షలు పెండింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఎప్పుడు పరీక్షలపై ఒక క్లారిటీ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలపై తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.
తెలంగాణలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.