గొల్లల మామిడాడలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా వైరస్ బారిన పడ్డారు.
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో కొత్తగా 64 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 589కి చేరింది. ఏలూరు సిటీ, రూరల్ పరిధిలో కొత్తగా 22 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ రెండు ప్రాంతాలలో పాజిటివ్ కేసులు 199కి చేరాయి. నరసాపురం, మొగల్తూరు తీరు పై ప్రాంతాన్ని కోవిడ్ కేసులు వణికిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా కొత్తగా తొమ్మిది కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం ఉన్న క్వారంటైన్ సెంటర్‌ను వంద పడకలతో కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఏలూరు సీఆర్‌ఆర్ మహిళా కాలేజీలో వంద పడకలతో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.