Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి తెలంగాణాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు - 5 నిమిషాలు ఆలస్యమైతే...

exams
, సోమవారం, 23 మే 2022 (09:06 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మే 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు జూన్ ఒకటో తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. 
 
అయితే, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించబోమని పరీక్షల నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షా సమయానికి ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. నిర్ణీత 9.35 తర్వాత అంటే 5 నిమిషాలు దాటితే లోపలకు అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. 
 
ఇదిలావుంటే, రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. అయితే, హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది హాజరుకానున్నారు. విద్యార్థులందరూ కరోనా నిబంధనల మేరకు మాస్క్‌ ధరించాలి. హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. 
 
కరోనా కారణంగా ఎన్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు పరీక్ష పేపర్ల సంఖ్యను 11 నుంచి 6కు తగ్గించినట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ ఎక్కువగా ఇవ్వనున్నామని, విద్యార్థులు చదివిన పాఠశాలలకు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు కేటాయించామని వెల్లడించింది. జనరల్‌ సైన్స్‌లో భాగంగా భౌతిక, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు వేరుగా ఇస్తామంది. 
 
ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలవుతుందని, పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేస్తామని పాఠశాల విద్యాశాఖ వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌తో సహా 15 దేశాలకు ప్రయాణాలు వద్దు - సౌదీ హెచ్చరిక