Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు - 13 మంది మృత్యువాత

road accident
, ఆదివారం, 22 మే 2022 (12:42 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. ఇరు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలోని హంటర్ రోడ్ ఫ్లై ఓవర్‌పై ఓ కారును ఢీకొట్టిన మరో కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ పై నుంచి పడిన కారులోని భార్యాభర్తలు మరణించారు. భర్త స్పాట్‌లోనే చనిపోగా.. అతడి భార్య ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య (42), సుజాత (39)గా గుర్తించారు. మరో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
అలాగే, ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద తెల్లవారుజామున ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, డ్రైవర్ సంఘటన స్థలంలోనే చనిపోయారు. డ్రైవర్‌ను తిమ్మాపూర్‌కు చెందిన బబ్లూగా గుర్తించారు. పోలీసులకుగానీ, అంబులెన్సుకుగానీ ప్రమాద సమాచారం అందకపోవడంతో మృతదేహాలు దాదాపు మూడుగంటల పాటు రోడ్డుపైనే పడి ఉన్నాయి. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి వద్ద బైకును వెనుకనుంచి వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టడంతో ఈసం హనుమంతు (34), ఈసం స్వామి (42) అనే ఇద్దరు దుర్మరణం చెందారు. వాళ్లిద్దరూ ఓ పెళ్లిలో బాజాలు మోగించి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హనుమంతు ప్రమాద స్థలంలోనే మరణించగా.. స్వామిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. 
 
మేడ్చల్ జిల్లా సూరారంలో కోళ్లను తీసుకెళుతున్న డీసీఎం వాహనం.. సూరారం కాలనీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎంలోని క్లీనర్ మరణించాడు. దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతిచెందారు. జిల్లాలోని మైలవరం మండలం తాడిపత్రి బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, చిన్నారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద రెండు బైకులు ఢీకొని ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిని కలకడ మండలానికి చెందిన సోమశేఖర్ (18), జ్యోతి నాయుడు (19)గా గుర్తించారు. గుట్టపల్లి ఆంజనేయ స్వామి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి