Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో సమ్మె ఎఫెక్ట్.. సామాన్యులపై సమ్మెట

తెలంగాణలో సమ్మె ఎఫెక్ట్.. సామాన్యులపై సమ్మెట
, శనివారం, 12 అక్టోబరు 2019 (07:56 IST)
కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపంలా తయారైంది తెలంగాణ ఆర్టీసీ సమ్మె. కార్మికులు పట్టువీడటం లేదు.. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపటం లేదు.

రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రజలు గమ్యానికి చేరేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కార్మికుల సమ్మె సామాన్యునిపై పెను ప్రభావం చూపిస్తోంది. కార్మికులు తగ్గటం లేదు.. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపటం లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్సులు, ఇతర వాహనాలు ప్రధాన మార్గాలకే పరిమితం కావడం వల్ల ఎక్కువగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల రోజువారీ ప్రయాణ ఖర్చులు రెండింతలవుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. బస్‌ పాసుల అనుమతి లేదు చాలా బస్సుల్లో తాత్కాలిక కండక్టర్లు బస్‌ పాసులను అనుమతించకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా అది పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి రాలేదు. ఇల్లెందు-ఖమ్మం రహదారిలో నిత్యం పదికిపైగా బస్సులు రహదారిపై కనిపించేవని.. సమ్మె కారణంగా కనీసం రెండు బస్సులు కూడా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం: రూ.850 ఛార్జీ హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వరకు కొన్ని ప్రైవేటు సర్వీసులు రూ.850 ఛార్జీ వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఎల్బీనగర్‌ నుంచి మిర్యాలగూడకు రూ.350 ఇస్తేనే బస్సు ఎక్కాలని, లేకుంటే అనుమతించేది లేదని కండక్టర్లు చెబుతుండటం గమనార్హం.

పరిమితికి మించి ప్రయాణికుల రవాణా హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరు, కర్నూలు మార్గాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గురువారం విజయవాడ వైపు వెళ్లిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం పైగా సర్వీసుల్లో వెయిటింగ్‌లిస్ట్‌ పరిమితి కూడా దాటిపోయింది.
 
అద్దె బస్సుల్లో ఛార్జీల మోత
ఆర్టీసీ అద్దె బస్సుల్లో భారీ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్​కు 180 రూపాయల ఛార్జ్ అయితే 270 డిమాండ్ చేశారు. కొరవడిన ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ... నిబంధనలను గాలికొదిలేసిన తాత్కాలిక సిబ్బంది, ప్రైవేటు బస్సు సర్వీసుల యజమానులు... వెరసి ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లుపడుతోంది.

పండుగకు సొంతూళ్లకు వెళ్లి... తిరుగు ప్రయాణమైన ప్రజలు... ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టికెట్లు లేక, లెక్కాపత్రం లేని ఛార్జీల వసూలుతో...... తాత్కాలిక సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
శనివారం బస్ భవన్ ముట్టడి
ఆర్టీసీ, కార్మికుల హక్కుల పరిరక్షణకు మద్దతుగా శనివారం బస్‌భవన్‌ను ముట్టడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రజాసంఘాలు, పౌర సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఆర్టీసీ కార్మిక సంఘాలు హాజరై మద్దతునివ్వాలని టీఎస్సార్టీసీ జేఏసీ 1 కన్వీనర్ కె. హనుమంతు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కళాభవన్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు.
 
టీఎస్ఆర్టీసీకి మద్దతుగా ఏపీఎస్ఆర్టీసీ ధర్నా
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని జేఏసీ నాయకులు అన్నారు.

ప్రభుత్వం తీరుకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల వద్ద మొదటి దశగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వజ్రాలు పొదిగిన ఎమిరేట్స్ విమానం?