Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చర్చలు

విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  చర్చలు
, గురువారం, 10 అక్టోబరు 2019 (11:25 IST)
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి.

పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్‌ 9, 10 విభజన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషీ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. 
 
సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు:
పెండింగులో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్లు ఎప్పుడూ జోన్ల ప్రకారం చేస్తారని, డీఎస్సీ స్థాయికి వెళ్తేనే కామన్‌ ప్రమోషన్లకిందకు వస్తుందని, పైగా ఫ్రీ జోన్‌లో ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, కేటాయింపులు ప్రకారం ప్రమోషన్లు ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనను హోంశాఖ అంగీకరించలేదు.

ఫ్రీజోన్‌ అనేది కొత్తగా వచ్చినది కాదని హోంశాఖ స్పష్టంచేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేవ్‌ వాదనతో అంగీకరించిన హోంశాఖ, ఆమేరకు సీనియార్టీని నిర్దారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంచేసింది. 
 
షెడ్యూల్‌ 9 ఆస్తుల విభజనపైనా కూడా హోంశాఖ సమావేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్‌ మొదటనుంచీ పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇరువురి వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నారు.

ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈజాబితాను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హోంశాఖ కార్యదర్శి, స్పందన ఏంటో తెలియజేయాలని కోరారు. 
 
తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖను ఆరాష్ట్రం ఏర్పాటైన ఏడాది తర్వాత పెట్టుకున్నారు. ఈ కాలానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే గ్యారెంటీలు, అప్పులు చెల్లించింది. దీని విలువ ఎంతో నిర్ధారించి ఆమేరకు ఏపీకి ఇవ్వడాలని హోంశాఖచెప్పింది. దీనికి తెలంగాణ ప్రభుత్వంకూడా అంగీకరించింది. సుమారు రూ.1700 కోట్లు రూపాయలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 
 
విద్యుత్‌బకాయిల విషయంలో భేదాభిప్రాయాలు లేవని ఇరు రాష్ట్రాలు హోంశాఖముందు స్పష్టంచేశాయి. కోట్ల బకాయిలు చెల్లించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేసింది. 
 
షెడ్యూల్‌ 10 కి సంబంధించి శిక్షణా సంస్థల విభజన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్రహోంశాఖ వివరణ ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హోంశాఖకు నివేదించింది. దీనిపై న్యాయసలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం చెప్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 
 
సింగరేణి కాలరీస్‌ విషయానికొస్తే విభజన చట్టంలోనే లోపాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖదృష్టికి తీసుకు వచ్చింది. షెడ్యూల్‌ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, మరోవైపు ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని తెలిపింది. చట్టప్రకారం ఏంచేయాలో పరిశీలించి తగు నిర్ణయాన్ని వెలువరిస్తామని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్పారు. 
 
షెడ్యూల్‌ 9, 10కు సంబంధించి ఆస్తుల విభజన ఒక నిర్ణీత కాలంలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకూ స్పష్టంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 వరకు ఆర్థిక మాంద్యంపై దేశవ్యాప్త నిరసనలు