తెలంగాణలో మావోయిస్టు పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు.
ఇటీవలే రామన్న అనారోగ్యంతో చనిపోయారు. రామన్న మృతి తర్వాత ఆమె భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సావిత్రి తాను లొంగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చారు.
కాగా.. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కట్టడికి పోలీసులు భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే, పలు జిల్లాల్లోకి మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ప్రవేశించాయన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ నక్సలిస్టుల ఫొటో జాబితాను సైతం విడుదల చేశారు.
ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత రజితను భద్రాద్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా సావిత్రి లొంగుబాటుతో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలినట్లు పేర్కొంటున్నారు.