Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌కు రీజినల్‌ రింగ్‌రోడ్డు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌కు రీజినల్‌ రింగ్‌రోడ్డు : కిషన్‌రెడ్డి
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:14 IST)
హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రీజినల్‌ రింగ్‌ రోడ్డు అంశంపై గడ్కరీని కలిశాం. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

హైదరాబాద్‌ నగరానికి 50 నుంచి 70 కి.మీల దూరంలో, ఓఆర్‌ఆర్‌కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. సుమారు 20కి పైగా ముఖ్య నగరాలు/పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరగనున్న ఈ రహదారితో  రాష్ట్రంలోని 40శాతం మంది ప్రజలకు రింగ్‌ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.

మొదటి దశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 158 కి.మీల మేర నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.9,522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. రెండో దశలో చౌటుప్పల్‌ - సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ రెండు దశల్లో కలిపి సుమారు రూ.17వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్‌కు వచ్చే అన్ని హైవేలను కలుపుతూ ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా పెరుగుతాయి’’ అన్నారు.
 
తెలంగాణ అభివృద్ధిలో ఇదో గేమ్‌ ఛేంజర్‌ కానుందని.. ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్‌రెడ్డి కోరారు.

తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఈ అపురూప ప్రాజెక్టును కేంద్రం రెండు పార్ట్‌లుగా నిర్వహించబోతోందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్‌ గడ్కరీలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: డీజీపీ