Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురిటి నొప్పులతో గర్భిణీ మహిళ తంటాలు.. ఇంట్లోనే ప్రసవం.. 6 గంటలు పోరాడి..?

పురిటి నొప్పులతో గర్భిణీ మహిళ తంటాలు.. ఇంట్లోనే ప్రసవం.. 6 గంటలు పోరాడి..?
, సోమవారం, 24 ఆగస్టు 2020 (16:56 IST)
pregnant woman
పురిటి నొప్పులతో నానా తంటాలు పడిన ఆ మహిళ.. ఆరు గంటల పాటు పోరాడి ఇంట్లోనే ప్రసవించింది. సుమారు 6గంటల పాటు ఆసుపత్రులన్నీ తిరిగి ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా జరిగింది ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు.. ఖమ్మం జిల్లాలోనే. వివరాల్లోకి వెళితే... కరోనా ప్రభావం లేకుండా గర్భిణులకు వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అనుకూలంగా కనిపించడంలేదు. 
 
కోవిడ్‌తో ఆసుపత్రుల్లో వైద్యం అందక ఇంట్లోనే కాన్పు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మంలోని రమణగుట్ట ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో లలిత, రమేష్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. రమేష్‌ ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. లలిత కూడా అక్కడే పని చేసేవారు. 
 
నెలలు నిండటంతో గత రెండు నెలలుగా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నెల 13న లలితకు పురిటి నొప్పులు వచ్చాయి. ఉమ్మనీరు సైతం ఎక్కువగా పోయింది. సాయంత్రం 6గంటల సమయంలో 108 వాహనం ద్వారా ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కనీసం అంబులెన్స్‌ కూడా దిగకముందే ఇక్కడ వైద్యులు లేరని సమాధానం వచ్చింది. నర్సులు మాత్రమే ఉన్నారని వేరే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు.
 
ఇలా ఖమ్మంలోని నాలుగు ఆసుపత్రులకు వెళ్లారు. ఒక్కరూ కూడా చేర్చుకోలేదు. మరో ఆసుపత్రికి తాళం వేసి ఉంది. మరో రెండు ఆసుపత్రుల్లో వైద్యులు చికిత్స అందించేందుకు భయపడ్డారు. ఈ పరిస్థితిలో చేసేదేమీ లేక అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. 
 
నొప్పులు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారు వచ్చారు. అందులో ఒకరు ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు పనిచేస్తుండటంతో ఆమె కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. జోరు వానలో రాత్రి సమయంలో ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యులు లేకపోవడం విచారకరమని ఆమె భర్త రమేష్‌ విచారం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్..చౌక ధరకు మొబైల్ ఫోన్లు..