Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్లో అమ్మకానికి రెండు తలల పాము... ఎందుకో తెలుసా?

ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టిన రెండు తలల పామును(Red Sand Boa), ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు ఇచ్చిన సమాచారంతో శంషాబాద్ సమీపంలో దాడి చేసిన అటవీ అధికారులకు ఈ ముఠా చిక్కింది. గత నెలన్

ఆన్‌లైన్లో అమ్మకానికి రెండు తలల పాము... ఎందుకో తెలుసా?
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (22:38 IST)
ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టిన రెండు తలల పామును(Red Sand Boa), ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు ఇచ్చిన సమాచారంతో శంషాబాద్ సమీపంలో దాడి చేసిన అటవీ అధికారులకు ఈ ముఠా చిక్కింది. గత నెలన్నర రోజుల వ్యవధిలో రెండు తలల పాము పేరుతో అమ్మకానికి పెట్టిన ఐదింటిని అటవీ శాఖ స్వాధీనం చేసుకుని రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది. రెండు తలల పాముగా పిలిచే రెడ్ సాండ్ బోకు ఎలాంటి అతీంద్రీయ శక్తులు ఉండవని, దాని పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇదివరకే ప్రకటించారు. 
 
వాస్తవానికి ఆ పాముకు రెండు తలలు ఉండవని, దాని తల, తోక కూడా ఒకే రకంగా ఉండటంతో రెండు తలల పాముగా ప్రాచుర్యంలోకి వచ్చిందని అటవీ శాఖ అదనపు సంరక్షణ అధికారి మునీంద్ర స్పష్టం చేశారు. తమ వద్ద రెండు తలల పాము ఉందని, అమ్ముతామంటూ వికారాబాద్ జిల్లా తాండూరు మండలం శాంతినగర్‌కు చెందిన ఉదయ్ కుమార్, రమేష్‌లు ఆన్‌లైన్లో ఓ పోస్టు పెట్టారు. దీనిని చూసిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ అధికారులు, సంస్థ సభ్యులు రంగంలోకి దిగి తామే ఆ రెండు తలల పామును కొంటాము అంటూ వారితో సంప్రదింపులు జరిపారు. 
 
నమ్మకం కుదిరాక నిందితులు వీరిని శంషాబాద్‌లోని ఒక హోటల్‌కు రమ్మని సమాచారం ఇచ్చారు. అక్కడే దాడి చేసిన అధికారులు ఇద్దరు నిందితులతో పాటు, ఒక ఐరన్ బాక్స్‌లో ఉంచిన పామును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరినీ స్థానిక పోలీసులకు అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా బండగొండ గ్రామం నుంచి తాము ఈ పామును తీసుకువచ్చినట్లు నిందితులు చెబుతున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న పాము రెండు కేజీల బరువు ఉంది. బరువు ఆధారంగా కూడా ఈ పాముల విక్రయం జరుగుతోందని, మూడు కేజీలకు పైగా బరువున్న పాముకు మరిన్ని శక్తులు ఉంటాయని, వాటిని అమ్మేవారు నమ్మబలుకుతారని, వాస్తవానికి ఈ రకమైన పాములకు ఎలాంటి అతీంద్రియ శక్తులు ఉండవని, ఆ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకుండా, పోలీసులకు, లేదంటే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని వన్యప్రాణి ప్రత్యేకాధికారి ఎ. శంకరన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైపుణ్య శిక్షణ, ముద్రపై ప్రధాని సమీక్ష... కాన్ఫరెన్సులో ఏపీ సీఎస్