Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ముర్ము.. షెడ్యూల్ ఇదే..

murmu
, గురువారం, 15 డిశెంబరు 2022 (09:49 IST)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరంలోని బొల్లారంకు రానున్నారు. ఇక్కడ ఆమె 30వ తేదీ వరకు ఉంటారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, రామప్ప ఆలయాల సందర్శన చేస్తారు. అలాగే, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ పర్యటన ఆద్యంతం ఆమె వివిధ కార్యక్రమాలతో బిజీగా బిజీగా గడుపనున్నారు.
 
శీతాకాల విడిదిలో భాగంగా ఆమె ఈ నెల 26వ  తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకుని 30వ తేదీ వరకు ఉంటారు. 26వ తేదీన మధ్యాహ్నం శ్రీశైలం దేవస్థానం సందర్శించి అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత తెలంగాణ పర్యటనకు బయలుదేరి వెళతారు. అదే రోజు మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.15 గంటల వరకు బొల్లారంలో యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడంతో పాటు వీరనారులను సన్మినించనున్నారు. సాయంత్రం 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఇచ్చే విందులో ఆమె పాల్గొంటారు. 
 
27వ తేదీ ఉదయం 10.30 గంటలకు నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీని సందర్శించి విద్యార్థులతో సంభాషించుకుంటారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీని సందర్శించి శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులతో ముచ్చటిస్తారు. 
 
ఈ నెల 28న ఉదయం 10.40 గంటల నుంచి 11.10 గంటల వరకు భద్రాచలం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. కేంద్ర పర్యాటక శాఖకి సంబంధించిన ప్రశాద్ అనే ప్రాజెక్టుకును ఈమె ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. మిధాని ఏర్పాటు చేసిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను అక్కడ నుంచే వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ సైతం ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖకి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
 
29వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు షేక్‌పేటలోని నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడి విద్యార్థులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శంషాబాద్‌లోని శ్రీరామానుజ చార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రంగారెడ్డి జిల్లా శాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్ సందర్శించి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. శ్రీరామచంద్ర మహారాజ్ 150వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రపతి నిలయంలో భోజనం చేసి ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జనవరి 6 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు