తెలంగాణలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో తాజాగా హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (హెచ్‌సీసీబీ) సంస్థ రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్‌ప్రాసెసింగ్ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది ఈ సంస్థ. మొదటి విడుతలో భాగంగా రూ.600 కోట్లను రానున్న రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో హెచ్‌సీసీబీ రెండో యూనిట్ ప్రారంభించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నూతన ఫ్యాక్టరీతో 300 మంది నిరుద్యోగులకు నేరుగా ఉపాధి లభించనుందని వివరించారు.