వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఏకాంతంగానే స్వామివారి ఉత్సవాలు నిర్వహించిన తితిదే..ఈసారి అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించింది.
శనివారం రాత్రి అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. ఈనెల19న పుష్పయాగంతో ముగుస్తాయి. 10వ తేదీన ధ్వజారోహణను ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19 వరకు 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.
తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. 15న సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ఏడాదీ బహిరంగ ప్రదేశంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు 52 ఎకరాల విస్తీర్ణంలో ... 52 వేల మంది కూర్చోని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణ ఘట్టాలను తిలకించేలా వేదికను తితిదే సిద్ధం చేసింది.
శాశ్వత కల్యాణ వేదిక నిర్మించిన తర్వాత జరుగుతున్న తొలి కల్యాణ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 15న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారి కల్యాణం జరుగనుంది. 2 కోట్ల రూపాయలను ఉత్సవాలకు తితిదే వెచ్చిస్తోంది.