గాడ్సేపై సానుకూల వ్యాఖ్యలు.. నాగబాబుపై ఠాణాలో ఫిర్యాదు

బుధవారం, 20 మే 2020 (21:57 IST)
జాతిపిత మహాత్మా గాంధీని తుపాకీతో కాల్చి చంపిన నాథూరాం గాడ్సేపై సానుకూల వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. జాతిపితను కించపరిచేలా, గాడ్సే దేశ భక్తిని పొగుడుతూ వ్యాఖ్యలు చేసిన నాగబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. 
 
గాడ్సే పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఇందులో "గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశమేనని, కానీ అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి లోబడి ఆనాడు మీడియా పనిచేసిందని" వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తాజా వివాదానికి దారి తీశాయి. అయితే తన ట్వీట్‌పై నాగబాబు వివరణ ఇచ్చుకున్నా... జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నాగబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇపుడు నాగబాబుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అందులో నాగబాబుపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పైగా, అతి తెలివితో మెగాస్టార్‌గా ఉన్న మీ అన్నకు చెడ్డపేరు తీసుకునిరావొద్దంటూ నాగబాబుకు కాంగ్రెస్ నేతలు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్