Publish Date: Sat, 28 Nov 2020 (07:56 IST)
Updated Date: Sat, 28 Nov 2020 (09:41 IST)
కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు తెలంగాణలో వచ్చే నెల 4 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అదే రోజున ఓ ఇంగ్లిష్ సినిమా విడుదల కానుండడంతో సినిమా హాళ్లను తిరిగి తెరవాలని వాటి యజమానులు నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌లు కూడా అదే రోజు తెరుచుకోనున్నాయి.
50 శాతం సామర్థ్యంతో థియేటర్లను తిరిగి తెరవవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంతో థియేటర్ యజమానులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు షోలే కాకుండా ఎక్కువ ఆటలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ల ధరలను పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యజమానులు ఆ దిశగానూ కసరత్తు ప్రారంభించారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యజమానులు నడిపే థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు వచ్చే నెల 4న తెరుచుకుంటాయన్నారు. లీజులో ఉన్న థియేటర్లు మాత్రం పెద్ద సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.