రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ శాఖలేని మంత్రిగా మారారు.
ఇదిలా ఉండగా మంత్రి ఈటెలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్, రెవెన్యూఅధికారులు తేల్చారు. కాసేపట్లో సీఎస్, ఏసీబీ డీజీ సంబంధిత నివేదికను సీఎం కేసీఆర్‌కు అందేయనున్నారు. ఈ పరిణామంతో ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయమని కోరే అవకాశం వుంది.
ఒక పక్కా ప్రణాళికతోనే నా రాజకీయ జీవితంపై దెబ్బకొట్టేందుకు ఇదంతా జరుగుతోందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ తోనే భూకబ్జా ఆరోపణలు చేశారని అన్నారు. అందరు నేతలు ఎన్నికలలో నిమగ్నమైతే తాను పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించారని ఈటల తెలిపారు.
అందుకే ఏం జరుగుతోందో తనకు తెలియలేదని అన్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పారు. మనసులో ఏదో పెట్టుకుని, కుట్ర పూరిత కథనాలతో, ఎదుటి వారి క్యారెక్టర్ ను నాశనం చేయాలనుకోవడం దారుణమని అన్నారు.
తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే సంగతి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 25 ఏళ్ల చరిత్రలో మచ్చలేని మనిషిగా నిలిచానని అన్నారు. ఎవరిపైనా తను వ్యక్తిగత విమర్శలు చేయబోనని అన్నారు. కేసీఆర్ ను కాంటాక్ట్ చేస్తారా? అనే మీడియా ప్రశ్నకు బదులుగా... ఎవరినీ కాంటాక్ట్ చేయబోనని స్పష్టం చేశారు.
కేసీఆర్‌తో పాటు ఎవరినీ కలవబోనని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిమానులు, అనుచరులతో కూడా చర్చిస్తానని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని తెలిపారు.