తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాటిచెట్టు ఎక్కి కల్లు గీశారు. ఆయన గురువారం జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాలకుర్తి మండలం, మల్లంపల్లిలో స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన మంత్రి ఎర్రబెల్లి.. అక్కడ కల్లుతో నిండివున్న కల్లు ముంతను కిందికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదిస్తూ తాగారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ తాటి చెట్టు మూడేళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేసిన చెట్టే కావడం గమనార్హం. కల్లు గీత కార్మికులకు ప్రోత్సాహం అందించే క్రమంలో నాడు ఎర్రబెల్లి గిరక తాటి మొక్కలను పంపిణీ చేశారు ఇపుడు అవి పెరిగి పెద్దవై కల్లు అందిస్తున్నాయి.
సాధారణ తాటిచెట్లు ఎంతో ఎత్తుకు పెరుగుతాయని, కానీ, గిరక తాటిచెట్లు మాత్రం తక్కువ ఎత్తులో స్వల్పకాలంలో కల్లుగీతకు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పైగా, గిరక తాటి చెట్లను ఎక్కడం కూడా చాలా సులువు అని చెప్పారు. ప్రమాదాలకు అవకాశం ఉండదని భావించిన తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఈ తరహా తాటి చెట్లను పంపిణీచేస్తుంది. వాస్తవానికి ఈ తరహా తాటిచెట్లు బీహార్ రాష్ట్రంలో అత్యధికంగా ఉంటాయి.