సాధారణంగా అత్తింటివారి వేధింపుల వల్ల కోడళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి వార్తలను ప్రతి రోజూ మనం వింటున్నాం. కానీ, ఇక్కడ ఓ అల్లుడు అత్తింటివారి పెట్టే మానసిక హింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, మహబూబాబాద్ జిల్లా గార్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు చెందిన బరిబద్దల రాకేష్(26)కు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేహతో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచి అత్తామామలు మునీందర్, రేణుకతో పాటు ఇతర బంధువులు రాకేష్‌ను వేధించసాగారు. ఏం పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ భార్యను ఎలా పోషిస్తావంటూ ఫోన్‌లో మానసికంగా వేధించేవారు. దీంతో రాకేష్ బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు రాకేష్ భార్య స్నేహ 20 రోజుల క్రితమే బాబుకు జన్మనిచ్చింది. మృతుడి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై డి.నాగేశ్వరరావు తెలిపారు.