కరోనా వ్యాక్సిన్. ఇదంటే కొందరు వణికిపోతున్నారు. టీకా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొందరు నమ్ముతున్నారు. దీనితో టీకా వేసుకోవాలని అడిగితే పారిపోతున్నారు. ఐతే ఓ యువకుడు ప్రాణాలనే తీసేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని కేపీఆర్ కాలనీలోని ఓ అపార్టుమెంటులో ప్రకాష్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ యువకుడి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వత్తిడి తెస్తున్నారు. తను టీకా వేసుకోనంటూ అతడు కూడా మొండిపట్టు పట్టాడు.
ఐతే కరోనా టీకా తీసుకోవాల్సిందేనంటూ అతడి తల్లి ఈ నెల 12న అతడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. దీనితో కరోనా టీకా వేసుకోమని వత్తిడి తెచ్చినందుకు అతడు పురుగుల మందు తాగేశాడు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిని జూబ్లిహిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఐతే అతడు చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.