దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఈ వైరస్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ 50 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉండే పలువురు రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు సైతం ఈ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు.
అయితే, నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మాట్లాడుతూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఉండే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఈ వైరస్ సోకలేదు. ఇదే అంశంపై ఓ నెటిజన్ ఓ ప్రశ్న సంధించాడు. దీనికి మంత్రి తనదైనశైలిలో ఆ నెటిజన్‌కు సమాధానమిస్తూనే, బీజేపీపై సెటైర్ వేశారు.
ఇంతకీ ఆ నెటిజన్ ఏమని అడిగారంటే... 'కేటీఆర్ సర్. మీరు ఇటీవల హైదాబాద్ నగరంలోని భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయాంలో కరోనా టీకాను తీసుకున్నారా? ఈ ప్రశ్నను నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, మీరు ప్రజల్లో ఎంతగా తిరుగుతూ ఉన్నా, మీకు ఏమీ కాలేదు. దీనికి కారణం మరేమైనా ఉందా?' అని ప్రశ్నించారు.
దీనికి మంత్రి కేటీఆర్ కూడా తనదైనశైలిలో బదులిచ్చారు. "అటువంటిది ఏమీ లేదు. నేనేమీ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోలేదు. వ్యాక్సిన్‌ను బీహార్ కోసమే రిజర్వ్ చేశారట" అని అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
దీనికి కారణం.. బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో తాము అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తామని ప్రధానంగా ప్రస్తావించింది. ఈ హామిపైనే మంత్రి కేటీఆర్ సెటైరికల్‌గా బదులిచ్చారు.