మహబూబాబాద్‌లో జరిగిన రైతు దీక్షలో ఎంపీ మాలోత్ కవిత చేతిలో నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కుని అవమానించిన ఘటన మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో మహిళా నేతకు పరాభవం ఎదురైంది. కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ సీతాలక్ష్మిని తోటి కౌన్సిలర్ భర్త బైక్‌తో ఢీకొట్టి కిందపడేశాడు. అంతేకాకుండా కిందపడిపోయిన మహిళను చూసి హేళన చేయడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అధిష్టానం నిరసనలకు పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లజెండాల నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మితో తోటి కౌన్సిలర్ భర్త అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె బైక్‌ని ఢీకొట్టడంతో అదుపుతప్పి చైర్‌పర్సన్ కిందపడిపోవడంతో బట్టలు పాడయ్యాయి.
మహిళా నేత ఏడుస్తూ దండం పెట్టినప్పటికీ ఆకతాయిలు ఆమెను అవహేళన చేశారు. బైక్ ర్యాలీలో రోడ్డుపై జరిగిన ఘోర అవమానంతో మున్సిపల్ చైర్ పర్సన్ వెక్కి వెక్కి ఏడ్చారు. కోపం ఉంటే ఇలా తీర్చుకుంటారా? ఇంత అవమానం చేస్తారా? బైకులో చీర ఇరుక్కుపోయింది ఆగమని బతిమిలాడా.. కుచ్చిళ్లు జారిపోతున్నాయని దండం పెట్టినా.. అయినా బైక్ ఇంకా రైజ్ చేసుకుంటూ పోయాడని కన్నీటి పర్యంతమయ్యారు.
చైర్ పర్సన్‌కే ఇంత అవమానం జరిగితే ఇక సాధారణ మహిళ పరిస్థితేంటి? అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారం జిల్లాలో సీరియస్‌గా మారింది.