తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఆమె మంగళవారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆమె తలనీలాలు సమర్పించి, ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆమెకు తితిదే ఆలయం అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆమె వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి స్వామివారిని దర్శనం చేయించారు.
కాగా, తన భర్త, సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి బులిటెన్ విడుదల కాకపోవడంతో పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఈ తరుణంలో ఆయన భార్య శోభ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించడం గమనార్హం.
బిగ్ బాస్ రియాలిటీ షోలో కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే!
ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారమవుతుంది. కన్నడలో పదో సీజన్ సందడి చేయనుంది. ఇది సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ షోకు కర్నాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా వచ్చారు. ఆయన ఓ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
ఈ ఎమ్మెల్యే చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన బిగ్ బాస్ హౌస్‌లోకి డప్పుల మోతల మధ్య అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, సదరు ఎమ్మెల్యేపై విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.
బిగ్ బాస్ షో అంటే ఎలా లేదన్నా కనీసం 100 రోజులు జరుగుతుంది. అంటే మూడు నెలలకు పైమాటే. ఎలిమినేట్ కాకుండా ఉంటే, అన్ని రోజుల పాటు హౌస్‌లో ఉండాల్సిందే. మరి, ఈ సమయంలో నియోజకవర్గం బాగోగులు ఎవరు చూస్తారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎమ్మెల్యే బిగ్ బాస్ పేరిట ఓ వినోద కార్యక్రమంలో పాల్గొనడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రజాసేవ చేస్తానని ప్రమాణం చేసి, బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ సిద్ధరామయ్యలకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి. కాగా, గత ఎన్నికల్లో కర్నాటక ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్‌పై ఆయన గెలుపొంది సంచలనం సృష్టించారు.