నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులోభాగంగా, నవంబరు 3వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కూడా పోటీ చేశారు. ఆయన తరపున ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం చండూరుకు వచ్చారు. ఇదేసమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
కోమటిరెడ్డిని చూసిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన కేఏ పాల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డికి ఆయన ఆసక్తికర విన్నపం చేశారు. ఉప ఎన్నికలో తనకు మద్దతును ఇవ్వాలని కోరారు. తనను గెలిపిస్తే 60 నెలల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పారు. మునుగోడును మరో అమెరికా చేస్తానని తెలిపారు.
మరోవైపు కేఏ పాల్‌ను చూసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. కేఏ పాల్ కూడా బీజేపీ శ్రేణులతో కలిసి కాసేపు నడిచారు. ఈ సందర్భంగా మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ, తనకు మద్దతును ఇవ్వాలని తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కోరానని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్లను కొనుక్కుంటున్నాయని ఆరోపించారు.
ఒకప్పుడు అడవిగా ఉన్న హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. తనను గెలిపిస్తే మునుగోడును మరో అమెరికా చేస్తానని అన్నారు. ఆరు నెలల్లో 7 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు విన్న అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.