అమెరికాలో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ప్రాంతానికి చెందిన 13 యేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. యూఎస్‌లో లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాలుడు ప్రాణాలు కోల్పోగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, లింగాలఘనపురం మండలం, బండ్లగూడేనికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబం గత 16 యేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈయన తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
ఈ వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరారు. లాస్‌ఏంజెలెస్ నగరంలోని ఓ ట్రాఫిక్ సిగ్నెల్ వద్ద కారు ఆగారు. ఆ సమయంలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన ఓ మహిళ వెనుక నుంచి రామచంద్రారెడ్డి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెనుకసీట్ల ఉన్న 13 యేళ్ల కుమారుడు అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డితో పాటు భార్య రజనీ రెడ్డి, కుమార్తె అక్షితా రెడ్డి (15)లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యూఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.