రాజకీయ శేషజీవితం కాంగ్రెస్ పార్టీలో గడిపేద్దాం అనుకున్న ధర్మపురి శ్రీనివాస్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు గట్టిగా ఆయన చేరికకు అడ్డు తగిలినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి కారణం వుందని పొలిటికల్ సర్కిళ్లలో వాదనలు వినిపిస్తున్నాయి.
కనీసం మాటమాత్రం తమతో చర్చించకుండా నేరుగా సోనియా వద్ద మంతనాలు జరిపి పార్టీలోకి దర్జాగా రావాలని డీఎస్ చేయడంపై టి.నాయకులు జీర్ణించుకోలేకపోయారట. మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీని డీఎస్ కుటుంబం సోనియాను, రాహుల్ గాంధీని తూర్పారబట్టారనీ, ఇపుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన చేరుతారు? ఏ ముఖం పెట్టుకుని ఆయనతో కలిసి మేము పనిచేస్తాము? అంటూ నేరుగా రాహుల్ గాంధీ వద్దే పంచాయతీ పెట్టారట.
నియోజకవర్గ పరిధిలో డీఎస్ చేరికకు ఎవ్వరూ ఆసక్తి చూపకపోగా, డీఎస్ చేరితే పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారట. దీనితో అధిష్టానం ఈ విషయంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద పార్టీలో చేరి శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకున్న డీఎస్‌కి షాక్ తగిలినట్లయింది.